Thursday, April 23, 2015

ఆ.ప్ర. నూతన రాజధాని చుట్టూ ముసురుకొన్న సమస్యలు

రాష్ట్ర విభజనతోనే విజయవాడ, గుంటూరు ప్రాంతాల భూయజమానుల మనస్తత్వంలో గణనీయమైన మార్పు చోటు చేసుకొన్నది. రాజధాని ప్రాంతంగా ప్రకటించబడిన తరువాత ఆ మనస్తత్వం మరింత బలపడిపోయింది. వారికి వ్యవసాయం కంటే భూముల ధరల పెరుగుదలపై బాగా మక్కువ పెరిగిందనడంలో నిస్సందేహం. భూమి ఖరీదైన‌ సరుకుగా మారిపోయి వాణిజ్య లక్షణాన్ని సంపూర్ణంగా సంతరించుకొని, షేర్ మార్కెట్ తరహాలో భూముల ధరల పెరుగుదల, తగ్గుదల ఒక జూదంగా పరిణమించింది.  కొద్ది కాలంలోనే ఆ దుష్పరిణామాల‌ పర్యవసానాలను గమనిస్తూనే ఉన్నాం. స్తిరాస్థి వ్యాపారస్తులు కొందరు ఆత్మహత్యలు చేసుకొన్న ఉదంతాలు వెలుగులోకి కూడా వచ్చాయి.
ఆహార భద్రత దేవుడెరుగు, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంలోను, దాని పరిసర ప్రాంతాల్లో సామాన్యులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం దుర్లబంగా మారనున్నది. ఉపాథిని వెతుక్కొంటూ నూతన రాజధానికి వచ్చే వెనుకబడ్డ‌ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత వాసులకు స్థిర నివాసం ఒక కలగానే మిగిలిపోతుంది. ఇంటి అద్దెలు కూడా చెల్లించుకోలేని దుస్థితి నెలకొని, ఇది సంపన్నుల రాజధాని, సామాన్యులకు ఇక్కడ చోటు లేదనే భావన ఏర్పడడం ఖాయం.
రాజధాని ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ‌ అతి పెద్ద సమస్యగా రూపుదాల్చే ప్రమాదం స్పష్టంగా కనబడుతున్నది. దాన్ని కొంత వరకైనా నివారించాలంటే పులిచింతల జలాశయం నుండి ప్రకాశం ఆనకట్ట వరకు, కృష్ణా నది ఒడ్డుకు రెండు, మూడు కిలో మీటర్ల వరకు 'గ్రీన్ బెల్ట్' గా ప్రకటిస్తూ ప్రత్యేక చట్టాన్ని తేవాలి. భష్టు పట్టిన ఈ రాజకీయ వ్యవస్థ భవిష్యత్తులో ఆ చట్టానికి తూట్లు పొడవరా! అంటే అలా జరగదని ఏ ఒక్కరూ బరోసా ఇవ్వలేరు. కాకపోతే తమ జీవితాలతో మెలివేసుకొన్న అలాంటి చట్టాన్ని పరిరక్షించుకొనే చైతన్యం ప్రజల్లో వస్తే దాన్ని ఎవరు అధికారంలోకి వచ్చినా బలహీన పరచడం అంత సులువు కాకపోవచ్చు. అలాంటి చట్టాన్నే రూపొందించక పోతే కృష్ణా నది పూర్తిగా కలుషితమై హైదరాబాదు మహానగరం మధ్యలో ప్రవహిస్తున్న మూసీలా తయారవ్వడం ముమ్మాటికీ ఖాయం.
తీవ్ర ఉష్ణోగ్రతలకు నెలవుగా ఉన్న రాజధాని ప్రాంతంలో వచ్చే నూతన నిర్మాణాల తరువాత ఉన్న పచ్చదనం కూడా ధ్వంసమై మరింత ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు విల‌విల్లాడవలసి వస్తుంది. ప్రత్యేక‌ చట్టాన్ని తీసుకు రాకపోతే భూములు రైతుల చేతుల్లో మిగిలే ప్రసక్తే లేదు. స్థిరాస్థి వ్యాపారస్తులు, పారిశ్రామిక వర్గాలు భూముల‌ ధరలు పెంచి, ప్రలోభ పెట్టి, రైతుల ను‍ండి భూములను కొనేసి వాణిజ్యపరం చేస్తారు. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకుండా కేవలం ప్రయివేటు వ్యవహారంగా వదిలేస్తే ల్యాండ్ మాఫియాలు విజృంభించే అవకాశం ఉన్నది. ఈ ప్రక్రియ అనివార్యంగా జరిగిపోతుంది. అది ఏ మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఈ తరహా అంశాలపైన లోతైన చర్చ జరగాలి.

No comments:

Post a Comment