Sunday, April 26, 2015

వ్యవసాయ సంక్షోభం: రైతు ఆత్మ‌హత్యలు - భూసేకరణ చట్టానికి సవరణలు - ప్రభుత్వ నీతి

రెండు రోజుల క్రితం ఒక రైతు మిత్రుడు ఫోన్ చేశాడు. మేమిరువురం ఐదు నుండి పదవ తరగతి వరకు కడప జిల్లా చిట్వేలి ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకొన్నాం. అతను వ్యవసాయదారుడుగా వృత్తిని ఎంచుకొన్నాడు. ఇప్పుడు ఆర్థిక వడుదుడుకులతో సతమతమవుతున్నాడు. ఆశ పెట్టుకొన్న‌రుణ మాఫీ పథకం తనకు వర్తించ లేదని చెప్పాడు. ఆ మండలంలో ఆరేడు మంది రైతులు మాత్రమే రుణ మాఫీకి అర్హులుగా ఎంపికైనారని చెప్పాడు. ఆర్థికంగా నిలదొక్కుకొని, పిల్లల చదువులకు అంతరాయం కలగకుండా ఎలా నెట్టుకు రావాలనే ఆవేదన వ్యక్తం చేస్తూ ప్ర‌త్యామ్నాయ ఉపాథి కోసం గత కొంత కాల‍ంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు ఇవ్వలేదని బాధపడ్డాడు. ఇది రైతాంగం యొక్క‌ హృదయవిదారకమైన దుస్థితికి అద్దం పడుతున్న ఒక ఉదంతం.
దాదాపు 60% మందికి ఉపాథి కల్పిస్తూ, జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి బయటపడేసి, రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తున్న సమస్యల మూలాల్లోకెళ్ళి శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తేనే దేశం ప్రగతి బాటలో అడుగు ముందుకు వేయగలదు. అప్పుడే 120 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఆహార భద్రతకు భంగం కలగకుండా జాగ్రత్త పడగలం. సరళీకృత ఆర్థిక విధానాలతో రైతు కొనాల్సిన విత్తనాలు మొదలు రసాయనిక ఎరువులు, పురుగు మందులు, ఆధినిక యంత్ర సామగ్రి, పనిముట్లు వగైరా అన్నింటి ధరలూ హనుమంతుని తోకలా పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు రైతాంగం వెన్ను విరుస్తున్నాయి. మెట్ట ప్రాంతాల రైతాంగం, తమ‌ కళ్ళ ముందే వేసిన‌ పంటలు, పండ్ల తోటలు, ఇతర ఉద్యాన వన పంటలు మలమల మాడిపోతుంటే గుండె తరుక్కు పోయి, అడుగంటి పోతున్న భూగర్భ జలాల వెంట పరిగెడుతూ బోర్ల మీద బోర్లు వేసుకొంటూ అప్పుల ఊబిలో కూరుక పోతున్నారు.
మార్కెట్ లో ఖరీదైన‌ సరుకులుగా మారిపోయిన పిల్లల చదువు, కుటుంబ సభ్యులకు వైద్యం ఖర్చులకు అప్పుల మీదే ఆధారపడ వలసిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం వైపు పరుగులు తీస్తూనే ఉన్నాయి. రైతులపై ఆర్థిక భారం మోపే రంగాలను, పారిశ్రామిక వర్గాలను నియంత్రించక పోగా వారికే అన్ని రకాల రాయితీలు ఇస్తూ ప్రభుత్వాలు వెన్నుదన్నుగా నిలిచి, ప్రోత్సహిస్తున్నాయి. వ్యవసాయ‌ రంగం సంక్షోభంలో కూరుకపోతున్న, నిరుద్యోగం పెరిగి పోతున్నా, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ముంచుకొస్తున్నా, పర్యావరణం ధ్వంసమౌతున్నా ఏ మాత్రం ఖాతరు చేయకుండా తాము పట్టిన‌ కుందేటికి మూడే కాళ్ళన్న నానుడిగా దేశ స్థూల జాతీయోత్ఫత్తి పెరగాలంటే విదేశీ మరియు స్వదేశీ కార్పోరేట్ సంస్థలకు ఎర్ర తివాచీ పరిచి, ఊడిగం చేస్తే తప్ప‌ పారిశ్రామికాభివృద్ధి జరగదన్న ఆర్థిక సిద్ధాంతాన్ని పాలకులు జపిస్తున్నారు.
రైతు పండించే పంటలకు మాత్రం లాభ సాటి ధరలను నిర్ణయించుకొనే కనీస‌ హక్కు లేదు. బ్రిటీష్ కాలం నాటి 1894 భూసేకరణ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని సాధించుకోవడానికి స్వాతంత్య్రానంతరం కూడా దశాబ్ధాల పాటు రైతాంగం అలుపెరగని ఉద్యమాలు చేసిన పలితంగా భూసేకరణ చట్టం_2013 వచ్చింది. అది 2014 జనవరి 1 నుండి అమలులోకి వస్తే కొన్ని నెలలు తిరగక ముందే పార్లమెంటు ఎన్నికలు రావడం, మోడీ నాయకత్వంలో నూతన ప్రభుత్వం అధికార పగ్గాలు చేబట్టడం చకచకా జరిగి పోయాయి. నూతన భూసేకరణ చట్టానికి ఏడాది వయసు కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేయడానికి నిబంధనలను రూపొందించి, ప్రక్రియే మొదలు పెట్ట‌లేదు. అప్పుడే ఆ చట్టంలోని రైతాంగానికి అనుకూలమైన కీలకాంశాలను ఒక్క దెబ్బతో తొలగించే దుష్ట చర్యకు మోడీ ప్రభుత్వం పూనుకొన్నది. అత్యవసర ఉత్తర్వు(ఆర్డినెన్స్) ఒకటికి, రెండు సార్లు జారీ చేసింది. ఆరు నూరైనా అగ్రహారం పాడైనా లెక్క చేయను చట్టానికి సవరణలు చేసి తీరుతానన్న మూర్ఖత్వాన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే తీరులో వ్యవహారాలను నడుపుతున్నది. రైతాంగ వ్యతిరేక, కార్పోరేట్ అనుకూల ప్రభుత్వమన్న‌ ముద్ర పడినా వెనుకంజ వేయకపోవడాన్ని గమనిస్తే సంపన్న వర్గాలకు ప్రయోజనాలను వనగూడ్చి పెట్టడానికే ఈ ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నట్లు స్పష్టమవుతున్నది.
వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవడానికి, వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించి లాభసాటిగా మార్చాలి. రైతాంగ ఆత్మహత్యలను అరికట్టడానికి రాజకీయ‌ సంకల్పంతో అవసరమైన కార్యాచరణను అమలు చేయాలి. ఆహారభద్రతను మరియు పర్యావరణాన్ని పరిరక్షించుకొంటూ, ఉపాథి అవకాశాలను, ప్రజల కొనుగోలు శక్తిని, జీవన ప్రమాణాలను పెంపొందించే పారిశ్రామికాభివృద్ధి సాధన కోసం కృషి జరగాలి. ఈ దృక్పథంతో శక్తివంతమైన ప్రజా ఉద్యమాల ఆవశ్యకత రోజు రోజుకూ పెరుగుతున్నది. పాలకుల తాత్విక చింతన మారాలి. రెండున్న దశాబ్ధాలుగా అమలు చేయబడుతున్న‌ సరళీకృత ఆర్థిక విధానాలలోని మంచి చెడులపై లోతైన సమీక్ష జరగాలి. వాటిలో ఏ అంశాలైతే సమాజానికి మేలు చేశాయో! వాటిని స్వీకరించి, హానికరమైన అంశాలను నిర్ద్వందంగా తిరష్కరించాలి. 

No comments:

Post a Comment