Sunday, April 5, 2015

'గవర్నర్' వ్యవహార శైలిపై సద్విమర్శ‌




ఈ రోజు ఆంధ్రజ్యోతిలో రాధాక్రిష్ణ గారు వ్రాసిన వ్యాసంలో "నరసింహన్ కు సంబందించి మనకు తెలిసిందల్లా... ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేస్తున్నారని మాత్రమే!" "గుళ్ళు గోపురాల సందర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. గవర్నర్ గా ఆయన ఇప్పటి వరకు 37 పర్యాయాలకుపైగా తిరుమలకు వెళ్ళి 60 సార్లకుపైగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. ప్రజల సొమ్ముతోనే ఆయన యాత్రలు సాగాయి. గుళ్ళకు వెళ్ళడం, భక్తితో పొర్లు దండాలు పెట్టుకోవడం వంటివి వ్యక్తి గత విశ్వాసాలు. వక్తి గత విశ్వాసాలు,మొక్కులు తీర్చుకోవడానికి ప్రజల సొమ్ము ఖర్చు చెసే అధికారం గవర్నర్ అయినంత మాత్రాన నరసింహన్ కు ఎవరిచ్చారు." 'ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు నరసింహా' అని తెలుగు ప్రజలు పాడుకోవచ్చు' అని సద్విమర్శ సంధించారు.
ఈ విమర్శను నేను నూటికి నూటాయాభై శాతం బలపరుస్తున్నాను. లౌకిక రాజ్యమని రోజూ కబుర్లు చెబుతూ రాష్ట్రానికి ప్రథమ పౌరుడుగా అన్ని రకాల సౌకర్యాలను, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ, తెలుగు నాట ఉన్న గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడమే ఆయన నిత్య‌కృత్యంగా పెట్టుకొని, తీర్త యాత్రలు చేసుకొంటూ కుటుంబ సమేతంగా 'రిటైర్డ్ లైఫ్'ను ఆహ్లాదకరంగా గడిపేస్తున్నారు. తెలుగు నాట రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా పట్టదు. త్రాగడానికి మంచి నీళ్ళు కరవై పోయి గొ‍తులెండి పోతున్న ప్రజల గోష ఎవరికీ వినిపించుకోరు. రాష్ట్ర విభజన పర్యవసానంగా రెండు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న వివాదాల పరిష్కారంలో క్రియాశీలంగా వ్యవహరించడం అటుంచి, అసలు సమస్యలే లేవన్నట్లు బాహ్య ప్రపంచానికి సొల్లుకబుర్లు చెబుతుంటారు.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యు.పి.ఎ. ప్రభుత్వం నియమించిన వివిధ రాష్ట్రాల గవరర్లను తొలగించడానికి పూనుకొన్న బిజెపి నేతృత్వంలోని యన్.డి.ఎ. కూటమి ప్రభుత్వం ఎందు చేత 'నరసింహన్' పై దృష్టి సారించలేదు. దీని వెనక చిదంబర రహస్యమేమైనా దాగి ఉన్నదేమోనని పిస్తున్నది. కాషాయ కూటమి మద్ధతు కూడగట్టుకొన్నారేమోనని కూడా అనుమానమొస్తోంది! తెలుగు ప్రజలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు, రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు మాత్రం నిజంగానే 'లైఫ్ ను ఎంజాయ్' చేస్తున్నారు. ఇది మన లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలోనే సాధ్యమవుతుందేమో!

No comments:

Post a Comment